ఇండియా కూటమికి గుడ్ బై చెప్పిన డీఎంకే.. ముగిసిన దశాబ్దాల బంధం

  • లోక్‌సభ స్పీకర్ డీఎంకే ఎంపీ కనిమొళి లేఖ
  • కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీట్లు కేటాయించాలని విన్నపం
  • కాంగ్రెస్ తో పొత్తు ముగిసిందని వెల్లడి

తమిళనాడు రాజకీయాల్లో భూకంపం వంటి పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మొదలైన విభేదాలు, ఇప్పుడు జాతీయ స్థాయిలో డీఎంకే - కాంగ్రెస్ మధ్య దశాబ్దాల కాలం నాటి పొత్తు తెగిపోయేలా చేశాయి. టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే, చివరకు కాంగ్రెస్‌తో బంధాన్ని అధికారికంగా తెంచుకుంది.


మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. కాంగ్రెస్‌తో పొత్తు ముగిసినందున, ఇకపై వారితో కలిసి కూర్చోవడం సముచితం కాదని ఆమె స్పష్టం చేశారు. ఈ నిర్ణయం 'ఇండియా' కూటమికి జాతీయ స్థాయిలో పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.


రాజకీయ వైరం ఇప్పుడు క్షేత్రస్థాయిలో భౌతిక దాడులకు దారితీసింది. మైలదుత్తురైలో కాంగ్రెస్ కార్యకర్తలపై డీఎంకే మద్దతుదారులు దాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిన్నటి వరకు మిత్రపక్షాలుగా ఉన్న ఇరు పార్టీల శ్రేణులు ఇలా వీధుల్లో ఘర్షణకు దిగడం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అగ్రనాయకత్వం మధ్య మొదలైన విభేదాలు కార్యకర్తల మధ్య శత్రుత్వానికి దారితీయడం ఆందోళన కలిగిస్తోంది.


కాంగ్రెస్ దూరం కావడంతో డీఎంకే ఇప్పుడు ఒంటరిగా లేదా కొత్త మిత్రుల కోసం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు, విజయ్ నేతృత్వంలోని టీవీకేకు కాంగ్రెస్ అండగా నిలవడంతో రాష్ట్రంలో కొత్త పవర్ సెంటర్ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామాలు కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కూడా ప్రతిపక్షాల ఐక్యతపై ప్రభావం చూపేలా ఉన్నాయి.


DMK
DMK Congress alliance
India alliance
Tamil Nadu politics
MK Stalin
Congress party
TVK Vijay
Kanimozhi
Indian National Congress

More Telugu News